Sunday, October 17, 2010

మైసూర్ దసరా సంబరాలకి నాలుగొందలేళ్లు ...

మైసూరు దసరాకు 400 ఏళ్లు

దేశమంతటా దసరా పండుగ చేసుకుంటున్నా దసరా వేడుకలని చూసి తరించాలంటే మాత్రం మైసూర్ వెళ్లి తీరాల్సిందే. అదే మైసూర్ దసరా ప్రత్యేకత. రైతుల దసరా, మహిళా దసరా, యువ దసరా, పిల్లల దసరా... ఇలా అక్కడ ఎవరి దసరా వారిదే. ఆటల పోటీలు, పాటల పోటీలు, యూత్ ఫెస్టివళ్లు, ఎగ్జిబిషన్లు, ఫుడ్ ఫెస్టివళ్లు, ఫిలిం ఫెస్టివళ్లు... వెరసి ఊరు ఊరంతా తిరునాళ్లే. అందుకే ఆ పది రోజుల పండుగకి రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలైపోతాయి. మైసూర్ దసరా పండుగని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. ఆ వేడుకల్ని తిలకించడానికి, వాటిలో భాగమై పోవడానికి దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు మైసూర్‌లో వాలిపోతారు. ఎప్పుడో రాజుల కాలంలో మొదలైన ఈ దసరా సంబరాలకి నేటికి నాలుగొందలేళ్లు. ఆ నాటి సంప్రదాయాన్ని, వైభవాన్ని ఓవైపు కొనసాగిస్తూనే మరోవైపు ఆధునికత ఉట్టిపడే సంబరాలకి వేదికైన మైసూర్‌దసరా.

అందరం పండుగలు చేసుకుంటాం. కాని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ పండుగలు మహోత్సవంలా, కన్నులపండుగగా జరుగుతాయి. ముంబై, హైదరాబాద్ వాసులు వినాయక చవితి ఎంత ఉల్లాసంగా చేసుకుంటారో కోల్‌కతా, మైసూర్‌వాసులు దసరా పండుగని అంత ఘనంగా జరుపుకుంటారు. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు మొదలయ్యాయో కాని మైసూర్ దసరాకు మాత్రం నేటికి నాలుగొందల ఏళ్లు. సాధారణంగా ప్రశాంతంగా ఉండే మైసూర్ నగరం దసరా సంబరాలు జరిగే పదిరోజులు మాత్రం నగరం నగరం ఉత్సవ సంరంభంతో హోరెత్తిపోతుంది.

1610-2010

నాలుగు శతాబ్దాల దసరా వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది కర్ణాటక ప్రభుత్వం. విజయనగర రాజుల కాలంలో కూడా దసరా ఉత్సవాలు వైభవంగా జరిగేవని చరిత్ర చెబుతుంది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఒడయార్‌లు శ్రీరంగపట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఆ కాలంలోనే శ్రీరంగపట్టణంలో 1610లో దసరా వేడుకలు జరపడం ప్రారంభించారు. ఆ తర్వాత ఒడయార్‌లు రాజధానిని మైసూర్‌కు మార్చుకున్నారు. అప్పుటి నుండి ఇప్పటికీ మైసూర్ వేదికగా ఏటా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి.

1947లో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు అప్పటి మైసూర్ మహారాజు శ్రీచామరాజ ఒడయార్ మైసూర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అయినా 1969 వరకు నిరాంటకంగా రాచరిక దసరా ఉత్సవాలు కొనసాగాయి. కానీ 1970లో అప్పటిప్రధాని ఇందిరా గాంధీ రాజులకు భరణాన్ని రద్దు చేయడంతో మైసూర్ దసరా వేడుకలు కొనసాగినా వాటి వైభవం మాత్రం తగ్గిపోయింది. అయితే 1981లో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఆర్. గుండూరావ్ దసరాకు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్వర్ణ అంబారీలో చాముండి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి విజయదశమి రోజున ఈ అంబారీ రాజసం ఉట్టి పడేలా లక్షలాది మందికి కన్నుల పండుగ చేస్తూ మైసూర్ రాచనగరి ప్రధాన వీధులగుండా సాగుతుంది. ఈ ఉత్సవాల్లో గజరాజులపై జంబూ సవారీయే కీలకమైన ఘట్టం. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. ఉత్సవాల వైభవాన్ని కళ్ళారా తిలకించాల్సిందేగానీ వర్ణించడం సాధ్యం కాదు.

సంస్కృతీ సంప్రదాయాలు

మైసూర్ దసరా ఉత్సవాలకు చారిత్రక నేపథ్యంతోపాటు పురాణ నేపథ్యం కూడా ఉంది. నవరాత్రి వేడుకలు దుష్ట సంహార సంకేతంగా, ధర్మ విజయానికి ప్రతీకగా జరుగుతాయి. తొమ్మిది రోజులపాటు శక్తిమాతకు జరిగే పూజలే ఇక్కడ కీలకం. దుర్గ, లక్ష్మీ, సరస్వతి, కాళీ, చాముండేశ్వరీ రూపాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించిన సందర్భం గా విజయదశమిని ఆచరించినట్లు పురాణాలు చెబుతాయి. ఉత్తర భారతదేశంలో రామలీలా ఉత్సవాలు ఎంత ఖ్యాతి పొందాయో, దక్షిణాదిన విజయదశమికి అంతే ఖ్యాతి లభించింది. విజయదశమి ఆచరించి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను పరస్పరం పంచుకోవడం వంటివి మైసూర్ సంప్రదాయాల్లో కొన్ని. నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆ రోజు అన్ని వృత్తుల వారు తమ తమ పనిముట్లను, వాహనాలను శుభ్రంగా కడిగి వాటికి ప్రత్యేక పూజలు జరపడం, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జైన గ్రంథాల ప్రకారం భరత చక్రవర్తి శస్త్రాగారంలో చక్రం కనిపించిన రోజు కూడా నవమే. ఈ చక్రంతోనే ఆయన భూమండలాన్ని జయించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.

ప్యాలెస్... అంబారీ


దసరా ఉత్సవాలకి మైసూర్ ప్యాలెస్సే ప్రధాన ఆకర్షణ. ఉత్సవాలు జరిగే రోజుల్లో ఇక్కడ కనిపించే హంగామా అంతా ఇంతా కాదు. ప్యాలెస్‌ను వేల విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు. మైసూర్ మహారాజుల నివాసం అయిన ఈ ప్యాలెస్‌లోనే ఉత్సవాలకు సంబంధించిన విలువైన సరంజామాను భద్రపరుస్తారు. ప్యాలెస్‌లోని సింహాసనం పెద్ద ఆకర్షణ. ఈ సింహాసనాన్ని అంజూర చెట్ల కలపతో చేసినట్లు చెబుతారు. ఏనుగు దంతాలు, బంగారంతో సింహాసనాన్ని ఎంతో అందంగా రూపొందించారు. బంగారు స్థంభాలను ఏర్పాటు చేశారు. 1940లో ఈ సింహాసనానికి కొద్దిగా మరమ్మత్తులు నిర్వహించారు. దసరా ఉత్సవాలు జరిగే 10 రోజులు మాత్రమే ఈ బంగారు సింహాసనాన్ని తిలకించే అవకాశం ప్రజలకు కల్పిస్తారు. ఒకే చెట్టు కలపతో, 750 కిలోల బంగారు తాపడంతో చేసిన అంబారీ ఈ ఉత్సవాల్లో మరో ప్రధాన ఆకర్షణ. దీనిపైనే చాముండీ అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఇప్పటికీ ఈ అంబారీ మైసూరు మహారాజుల వంశస్తుల పర్యవేక్షణలోనే పదిలంగా ఉంది.

మహారాజుల కాలంలో ఉత్సవాలవేళ దర్బార్ కొనసాగేది. మహారాజు, ఆయన మంత్రులు కొలువుదీరి ఉండగా సభలో వివిధ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు జరిగేవి. కవితా గోష్టి జరిగేది. సాహిత్య చర్చలు ఉండేవి. మహారాజుల అలనాటి కళాపోషణను నేటికీ దసరా ఉత్సవాల్లో కొనసాగిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి రోజూ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ, విదేశాలనుంచి కళాకారులు కూడా హాజరవుతుంటారు. ఈ కార్యక్రమాలు తిలకించాలంటే ప్రత్యేక టికెట్ కొనాల్సిందే.

నాగర హోళె నుండి గజరాజులు

అంబారీ ప్రదర్శనలో పాల్గొనే ఏనుగుల బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. నాగర హొళె అటవీ ప్రదేశంలోని ఒక గ్రామంలో ఉండే ఏనుగులు రెండు బృందాలుగా ఉత్సవాలకు హాజరవుతాయి. వీటికి సంప్రదాయ రీతిలో మంగళ వాయిద్యాలతో ఘనస్వాగతం పలుకుతారు. బంగారు అంబారీని మోసుకురానున్న బలరామ, అభిమన్యు, గజేంద్ర, అర్జున, రేవతి, సరళ అనే ఏనుగులు ఒక బృందంగాను, మిగిలిన ఏనుగులు రెండో బృందంగాను వస్తాయి. ఏనుగులతోపాటు వచ్చే మావటీలకు, ఇతర సిబ్బంది కుటుంబాలకు ఉత్సవాలు ముగిసేంత వరకు ప్యాలెస్ ఆవరణలోనే విడిది ఏర్పాటు చేస్తారు.

అంబారీ ప్రదర్శనకు ఒక రోజు ముందు జరిగే దసరా దివిటీల ప్రదర్శన కూడా కన్నుల పండువగా ఉంటుంది. ఆధునికతను జోడించి లేజర్ షోను కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించాక అచ్చం మన ఢిల్లీ గణతంత్ర ఉత్సవాల్లో మాదిరిగా ఇక్కడ వివిధ శకటాల ప్రదర్శన జరుగుతుంటుంది. ఇందులో వివిధ జిల్లాలు, శాఖల అభివృద్ధిని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలను మైసూర్ ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు. అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లోనూ దసరా వైభవం కనిపిస్తుంటుంది. బొమ్మల పండుగ రోజు జరిగే సంబరాలు, కుల మతాలకు అతీతంగా ప్రజలను అలరిస్తుంటాయి.

తలపాగా ఇచ్చి ఆహ్వానిస్తారు

మహారాజుల హయాంలో దివాన్, పండితులు కలిసి వెళ్లి తలపాగా, పండ్లు, కానుకలు సమర్పించి మహారాజును దసరా ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించేవారు. ఇదే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఉత్సవాలకు మొదటి ఆహ్వానం మైసూరు మహారాజు కుటుంబీకులకు అందుతుంది. ఆపై ముఖ్యమంత్రిని, జిల్లా అధికారులను ఇదే రీతిలో తలపాగాతో సత్కరించి సంప్రదాయ బద్ధంగా ఆహ్వానిస్తారు. దసరా ఉత్సవాల వైభవం కారణంగానే మైసూర్ శైలి తలపాగాకి కూడా ఎక్కడలేని ప్రాచుర్యం వచ్చింది. పండితులను మైసూరు త లపాగాతో అప్పట్లో మహారాజులు సత్కరించేవారు. కన్నడ నాట నేడు జరిగే ప్రతి సన్మానంలోనూ మైసూరు తలపాగా తప్పనిసరిగా ఉండాల్సిందే.

పూజలతో ప్రారంభం

మైసూర్ దసరా ఉత్సవాలు చాముండేశ్వరి దేవి పూజలతో లాంఛనంగా ప్రారంభమవుతాయి. యేటా ఒక్కో ప్రముఖుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇక్కడ ఆనవాయితీ. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుతూ ముఖ్యమంత్రి చాముండేశ్వరి దేవికి పూజలు నిర్వహిస్తారు. మహారాజుల కాలంలో ఉత్సవాల సమయంలో కుస్తీ పోటీలను, హిందూస్తానీ, కర్ణాటక సంగీతం, భరత నాట్యం, కూచిపూడి ఉత్సవాలు నిర్వహించేవారు. అప్పట్లో సాహస కృత్యాలు కూడా ఆకర్షణగా ఉండేవి. ఇప్పుడు సైనికుల సాహస కృత్యాలు మైసూర్ దసరా ఉత్సవాలకు తిరుగులేని ఆకర్షణగా ఉంటున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనే నేటి తరాన్ని ఆకట్టుకునేందుకు సినిమా ప్రదర్శనలు, వస్తు ప్రదర్శనలు, క్రీడా పోటీలు, మ్యూజికల్ నైట్స్ వంటి వాటిని చేర్చారు.

పర్యాటకుల సందడి

వేడుకలకి రాచనగరి మొత్తం అందంగా ముస్తాబవుతుంది. హోటళ్ళు, పర్యాటక కేంద్రాలు అన్నీ విద్యుద్దీపాల కాంతులతో వెలిగిపోతూ ఉంటాయి. పర్యాటకుల కోసం మైసూరు శివార్లలో వందలాది రిసార్టులు కూడా వెలిశాయి. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మైసూర్‌కు ఉత్సవాల సమయంలో రెగ్యులర్‌గా విమాన సర్వీసులను కూడా ప్రవేశపెట్టారు. ప్రత్యేక రైళ్ళు, బస్సులను నడపడం సాధారణంగా జరిగేదే. మైసూర్ సంప్రదాయక జట్కా బళ్ళు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. ఈ ఉత్సవాల సమయంలో మైసూర్ మొత్తం తిరగడానికి 50 రూపాయల ప్రత్యేక బస్సు పాస్‌ను ప్రవేశ పెట్టింది. దసరా 400 వసంతాలు పూర్తి చేసుకోవడంతో ఉత్సవాల నిర్వహణ కోసం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది.

ఇది అందరి దసరా..

ఉత్సవాలను ప్రజలందరి దసరాగా నిర్వహించేందుకు కాలక్రమంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. దీనిలో భాగంగా యూత్ దసరా, మహిళల దసరా, బాలల దసరా వంటివి పుట్టుకొచ్చాయి. యూత్ దసరా సందర్భంగా జిల్లా యంత్రాంగం దాదాపు 15 విభాగాల్లో రకరకాల పోటీలను నిర్వహిస్తుంది. ఇందులో క్రీడలతో పాటు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, ట్రెజర్‌హంట్, మోటార్ బైక్ రేస్ వంటి వాటిని యువత కోసమే ప్రవేశ పెట్టారు. ఈ సారి ఉత్సవాల్లో సినీ పాటల పోటీలతో పాటు జానపద సంగీత పోటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు యక్షగానం, ఏకపాత్రాభినయం, మూకాభినయం, మిమిక్రీ వంటి పోటీలు ఈ జాబితాలో చేరాయి. బాలల దసరా మరో వినూత్న ఆకర్షణ.
జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకల సమయంలో విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటిస్తారు. బాలల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు రకరకాల పోటీలను నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో ఒకప్పటి చదరంగంతో పాటు నేటి అబాకస్ పోటీ కూడా చేరింది. మహిళా దసరా గురించి చెప్పుకొంటే ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, ఫ్యాషన్ షోలు వంటివి ఉంటాయి. ఇక రైతుల దసరాలో రైతాంగాన్ని ఉత్సాహ పరిచే ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తారు. వృద్ధుల కోసం కూడా ప్రత్యేక దసరా ఉంది. వీరి కోసమే ఈ ఏడాది మానసికోల్లాస కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వికలాంగులకు కూడా దసరా ఉత్సవాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఈ విధంగా దసరా అందరి పండుగగా మారింది.

ఈ సారి దసరా వేడుకల మరో ప్రత్యేకత ఏమిటంటే... మైసూర్ రాచనగరులోని మధ్యతరహా హోటళ్ళన్నీ 20 రూపాయలకే మైసూర్ సంప్రదాయ భోజనం పెట్టనున్నాయి. అతిథి దేవోభవ సూత్రాన్ని పాటించేందుకు 40 హోటళ్ళు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ముందుకొచ్చాయి. పర్యాటకులు ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగం చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

ఇంటింటా సంబరమే

దసరా ఉత్సవాలు కేవలం ప్యాలెస్ చుట్టుప్రక్కల ప్రాంతాలకే పరిమితం కాదు. నగరం లోని అన్ని వీధులూ సంప్రదాయ అలంకరణతో అత్యంత వైభవోపేతంగా కనిపిస్తాయి. స్థానిక దేవస్థానాలను ఇతర ప్రార్థనా మందిరాలను వేడుకల సమయంలో అందంగా అలంకరిస్తారు. ప్రతి ఇంటా దసరా సంబరాల హడావుడి కనిపిస్తుంటుంది. వ్యాపారులు యేటా ఈ వేడుకల కోసమే ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో వారి వ్యాపారాలు మూడు పూవులు, ఆరు కాయల్లా వర్ధిల్లుతాయి. అందుకే దుకాణాలను అందంగా అలంకరిస్తారు. ఏడాదికి సరిపడా ఆదాయాన్ని దసరా సమయంలోనే సంపాదించుకొనే చిన్న వ్యాపారులు వందల సంఖ్యలో ఉన్నారు.

ప్యాలెస్ లోనే కాకుండా రాచనగరిలో ఇంటింటా బొమ్మల పండుగ చేయడం మైసూర్‌లో సంప్రదాయంగా వస్తోంది. రకరకాల బొమ్మలను ఒకచోట చేర్చి పూజలు చేయడం వల్ల సుఖదాంపత్యం ఏర్పడుతుందని పూర్వీకులు నమ్మేవారు. ఉత్సవాల మొదటి రోజు ఏర్పాటయ్యే ఈ బొమ్మల కొలువు 9 రోజులపాటు ఉంటుంది. వీటితోపాటు నవధాన్యాలు, నవ పత్రాలు, దశావతారాల మూర్తులు వంటివి ఉంచడం ఆనవాయితీ. ఇప్పుడైతే బొమ్మల కొలువులో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు కూడా చేరుతున్నాయి.

దసరా ఎగ్జిబిషన్

వివిధ దేశాల, రాష్ట్రాల సంస్కృతులకు దర్పణం పట్టే అనేక కళా ఖండాలు, వస్తువులు, ఆట బొమ్మలు, వస్త్రాలు దసరా ప్రదర్శనలో ఉంటాయి. ఆటపాటలు, విందు వినోదాలు ఇందులో భాగం.
దసరా ఉత్సవాలు తిలకించేందుకు విచ్చేసే పర్యాటకులు ఎగ్జిబిషన్ చూడకుండా తిరిగి వెళ్ళరు. వందకు పైగా ఎకరాల స్థంలో రెండు నెలల ముందుగానే ఈ ఎగ్జిబిషన్‌కు ఏర్పాట్లు చేస్తారు. ఈ సారి ప్రభుత్వం ఎగ్జిబిషన్ నిర్వహణకు రూ.40 కోట్లు కేటాయించింది. సాహిత్య అభిలాష, పుస్తకాలపై మక్కువ ఉన్నవారి కోసం భారీ పుస్తక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ భాషల్లో, వివిధ అంశాలతో కూడిన లక్షలాది పుస్తకాలను ప్రదర్శిస్తున్నారు.

దసరా ఉత్సవాల్లో సినిమా సంబరాలూ భాగమే. సినిమా అభిమానులను నిరాశపర్చకుండా నగరంలోని అన్ని ప్రధాన థియేటర్లలో వివిధ భాషల చిత్రాలను ప్రదర్శిస్తారు. జాతీయ పురస్కారాలు పొందిన చిత్రాలతో పాటు అనేక విదేశీ చిత్రాలను కూడా ఈ సంవత్సరం ప్రదర్శించబోతున్నారు. విదేశీ పర్యాటకులకు ఇది మరో అదనపు ఆకర్షణ.

సామరస్యానికి ప్రతీక

"తాతల కాలం నుంచి మైసూరు దసరా వేడుకలను అత్యంత దగ్గరి నుంచి తిలకించే భాగ్యం నాకు లభించింది. కుటుంబ సభ్యులమందరం ఉత్సాహంగా ఈ సంప్రదాయ దసరా వేడుకల్లో పాల్గొనేవాళ్ళం. అప్పట్లో మా తాతగారు బంగారు సింహాసనంపై కూర్చొని దర్బార్ నిర్వహిస్తుంటే ఆ ఠీవి చూడముచ్చటగా ఉండేది. కాలక్రమంలో రాజ వంశస్తుడిగా నాకు కూడా ఈ బంగారు సింహాసనాన్ని అధిష్టించే అపురూప అవకాశం లభించింది. దీనిని పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తుంటాను. మైసూర్ దసరా కర్ణాటక ప్రజల జీవితంలో ఓ భాగంగా మారింది. అన్ని వర్గాల ప్రజల మధ్య సామరస్యానికి బలమైన పునాదులు వేసింది. అందుకే ఈ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా పాల్గొంటుంటారు.

అసలు ఇలాంటి ఉత్సవాల నిర్వహణ ఉద్దేశం కూడా అదే. గణేష్ ఉత్సవాల నిర్వహణలో కనిపించే సామరస్యం మైసూర్ దసరా ఉత్సవాల్లో కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. రాజుల కాలం నుంచి తరాలు మారి ఉత్సవాలు కొత్తరూపం సంతరించుకున్నా ఆ సందడి మాత్రం తగ్గనేలేదు. పైగా ఏటా దాని వైభవం పెరుగుతూనే ఉంది. దసరా ఉత్సవాలను ప్రజలు, ప్రభుత్వం సంయుక్తంగా కలిసి నిర్వహించడం అనేది బహుశా దేశంలో మరెక్కడా లేదనుకుంటాను. ఈ చరిత్రాత్మక దసరా మరిన్ని వందల వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలన్నదే నా ఆకాంక్ష. నాటి తరం దసరా వైభవాన్ని నేటి తరానికి చాటి చెప్పే ప్రయత్నం మరింతగా జరగాలని కోరుకుంటున్నాను.''
- శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మాజీ యువరాజు 
* అబ్దుల్ రజాక్
 బెంగుళూరు

Saturday, October 16, 2010

విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి...

విజయీభవ..!
నవరాత్రి పూజను తొమ్మిది రోజులపాటు చేయాలి. తొమ్మిది రోజులు చేయలేనివారు ఐదురోజులు, ఐదురోజులు చేయలేనివారు మూడు రోజులు, మూడు రోజులు కూడా చేయలేనివారు కనీసం ఒక్కరోజయినా పూజ చేసినట్లయితే సంవత్సరమంతా అమ్మవారిని ఆరాధించిన ఫలం లభిస్తుందని శాస్తవ్రచనం. నవరాత్ర వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. నారద పాంచరాత్ర గ్రంథంలో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడని, రాత్రి శబ్దానికి పరమేశ్వరి అనీ అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే పార్వతీ పరమేశ్వరుల ఆరాధనమే నవరాత్ర వ్రతం.

విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ పని, వృత్తి, వ్యాపారం అయినా అఖండ విజయం సాధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం!


నవరాత్రి ఉత్సవాల్లో అందరినీ సమ్మోహితులను చేసే అంశం - అమ్మవారి అలంకారాలు. రాక్షస సంహార క్రమంలో దుర్గాదేవి ధరించిన రూపాలకు ప్రతిగా రోజుకు ఒక అలంకారం చొప్పున నవరాత్రులు జరిగే రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అసుర సంహారంచేసి సాధించిన విజయానికి చిహ్నంగా పదో రోజున విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారు. మధుకైటభాది రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన ఈ రూపాలనే ‘నవదుర్గా’ రూపాలుగా దేవీ, మార్కండేయ, భవిష్య పురాణాలు చెబుతున్నాయి. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిద అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి.

మహాగౌరి : అనితర సాధ్యమైన తపస్సు ద్వారా నల్లని తన మేని ఛాయను మార్చుకుని ధవళ కాంతులతో ప్రకాశించిన దుర్గాదేవి స్వరూపం మహాగౌరి. ఈమె ఉపాసన సద్యఃఫలదాయకమై, భవిష్యత్తులో సైతం పాపచింతనలు దరిచేయనీయదు. అసంభవాలైన కార్యాలు సాధించడానికి ఈ తల్లి అనుగ్రహం ఎంతో అవసరం.

సిద్ధిదాత్రి: అష్ట సిద్ధులతోపాటు మోక్షసిద్ధిని కలిగించే అమ్మరూపం ‘సిద్ధిద’. లౌకిక, అలౌకిక సర్వార్థ సిద్ధులకు ఈమెను అధిష్టాన దేవతగా శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. సర్వకార్య సాధక స్వరూపం సిద్ధిద. పరమ శివుని అర్ధభాగంగా ఉన్న ఈమె చతుర్భుజాలతో భక్తుల పూజలందుకుంటుంది. ఈమె కమలాసన. మరొక కమలాన్ని చేతిలో ధరించి ఉంటుంది. ఈమెను నిష్ఠతో ఆరాధించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. అంత్యకాలంలో పరమపదాన్ని చేరుకుంటారు.

కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఆదిశక్తిని వివిధ రూపాలతో, నామాలతో అర్చిస్తారు. దుర్గ, లక్ష్మి, సరస్వతి రూపాలలో జీవితాన్ని సుఖశాంతిమయం చేసుకునే రాత్రులే నవరాత్రులు. నవరాత్రులలోని మొదటి మూడు రాత్రులు దుర్గగా, తర్వాతి మూడురాత్రులు లక్ష్మిగా, చివరి మూడు రాత్రులు సరస్వతిగా శక్తిస్వరూపిణి అయిన అమ్మ ఆరాధనలు అందుకుంటుంది.
పదవ రోజున నవరాత్రి పూజలకు స్వస్తిచెబుతూ విజయదశమి వేడుకలు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో శరన్నవరాత్రోత్సవాలలో శ్రీరాముని ఆరాధన కూడా జరుగుతుంటుంది.

విజయానికి నాంది ఈ దశమి
నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించి శక్తి పుంజుకున్న మానవుడు విజయం కోసం ఉవ్విళ్లూరడం సహజం. ఎందుకంటే దసరా పండుగ అందరికీ విజయాలను చేకూర్చే పండుగ. ఎందరో రాజులు విజయ దశమిని విజయప్రాప్తి దినంగా ఎన్నుకున్నట్లు చరిత్ర చెబుతోంది శ్రీరాముని పాలనాకాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీ రాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడు. ఛత్రపతి శివాజీ మొగలాయి రాజు ఔరంగజేబును ఎదుర్కొనడానికి విజయదశమినే ముహూర్తంగా ఎంచుకుని, అదేరోజున యుద్ధం చేసి, అఖండ విజయం సాధించాడు.

ఆశ్వయుజమాసంలో విజయవాడలోనూ తిరుమలలోనూ జరిగే బ్రహ్మోత్సవాల సందడి యావద్భారతదేశానికీ కన్నుల పండువ చేస్తుంది. ఈ మహోత్సవాల సంబరాన్ని తిలకించాలంటే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి తీరవలసిందే. ఈ పదిరోజులూ చేసే పూజలూ అలాంకారాలతో అమ్మ నూతన తేజస్సును సంతరించుకుని మరింత శోభాయమానంగా దర్శనమిస్తుంది.

కారణజన్మురాలయిన దుర్గమ్మ త్రిమూర్తుల తేజస్సుతో, త్రిమూర్తుల తే జస్సుతో, ముక్కోటి దేవతల శక్తులనూ పుణికిపుచ్చుకుని మహిషారుడనే లోకకంటకుడయిన రాక్షసుని సంహరించి విజయాన్ని చేజిక్కించుకుంది.

కౌమారీ పూజ
నవరాత్రులలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క దేవతను పూజించే విధానం దేవీభాగవతంలో ఉంది. దీని ప్రకారం కన్నెపిల్లలను లేదా రజస్వల కాని బాలికలను మంత్రోక్త విధానంలో దేవతావాహనం చేసి పూజిస్తారు.
తొలిరోజు అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు రెండేళ్ల వయసున్న బాలికను పూజిస్తారు. అది మొదలు నవరాత్రులు ముగిసేవరకు బాలికలను ఇంటికి తీసుకొచ్చి వారిలో నవదుర్గలను ఆవాహన చేసి షోడశోపచారాలతో సర్వాలంకార శోభాయమానంగా పూజిస్తారు.

శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్షం కనక ధారలు కురిపిస్తుందనే విశ్వాసం ఉంది. శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు అన్నీ విజయ సోపానాలకు దారితీస్తాయనే నమ్మకం అనాదిగా ఉంది. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్ర్తాలను జమ్మిచెట్టుపైనే దాచారు.

మహిషాసురమర్దిని: సర్వదేవతల తేజస్సుల కలయిక అయిన ఆదిశక్తి మహిషాసుర మర్దిని. ఆశ్వయుజ శుద్ధ నవమిరోజున మహిషాసురుడిని సంహరించింది కనుక మహర్నవమినాడు అమ్మకు ఆ అలంకరణ చేస్తారు. సింహవాహన అయిన మహిషాసురమర్దిని నేటి పర్వదినాన ఉగ్రరూపంలోగాక శాంతమూర్తిగా దర్శనమివ్వడం విశేషం. మహిషాసురమర్దిని అలంకార ంలో అమ్మను దర్శించుకోవడం వల్ల భక్తులకు సకల శుభాలూ చేకూరడమేగాక పిశాచబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.

శ్రీరాజరాజేశ్వరి: లోకశుభంకరి, అపరాజితాదేవి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి దసరా ఉత్సవాల ముగింపు రోజయిన విజయదశమినాడు భక్తులకు చెరకుగడతో, అభయముద్రతో, ఆర్తితో పిలవగానే వచ్చే పాపగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ అవతారాన్ని దర్శించడం వల్ల సర్వకార్యానుకూలత, దిగ్విజయ ప్రాప్తి కలుగుతాయి.

దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుకు కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. తెలంగాణ ప్రాంతంలో దసరాకు చేసే బతుకమ్మ పండుగ ప్రఖ్యాతమైంది. విజయనగరంలో పైడితల్లి వేడుకలు జరుపుతారు. ఆంధ్రప్రాంతంలోని పల్లెలలో ‘శమీశమయితే పాపం శమీ శత్రువినాశనం, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’ అంటూ శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మి ఆకును తీసుకు వచ్చి, జమ్మి బంగారాన్ని అందరికీ పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఆశీస్సులు అందుకోవడం ఒక వేడుకగా జరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థలలోనూ, కర్మాగారాలలోనూ యంత్రాలను పూజిస్తారు.
ఈ విజయదశమి అందరికీ అన్ని రంగాలలోనూ విజయాలను చేకూర్చాలని ఆదిపరాశక్తిని ప్రార్థిద్దాం!